Mushroom Pakora : మనకు వర్షాకాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. కానీ ప్రస్తుత కాలంలో ఇవి కాలంతో సంబంధం లేకుండా విరివిరిగా లభిస్తున్నాయి. చాలా మంది వీటిని తినడానికి ఎంతో ఇష్టపడతారు. పుట్ట గొడుగుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
పుట్ట గొడుగులతో వంటలే కాకుండా చిరుతిళ్లను కూడా మనం తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా పుట్టగొడుగులతో రుచిగా పకోడీలను ఎలా తయారుచేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్ట గొడుగులు – 200 గ్రా., ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని, జీడిపప్పు – కొద్దిగా, కరివేపాకు – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మష్రూమ్ పకోడీలను తయారు చేసే విధానం..
ముందుగా పుట్ట గొడుగులను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తరువాత పుట్ట గొడుగు ముక్కలను వేసి కలుపుకోవాలి. తరువాత బియ్యం పిండి, శనగ పిండి, కార్న్ ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పుట్ట గొడుగు ముక్కలను వేసి కలుపుతూ వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత మిగిలిన మిశ్రమంలో కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి కలిపి అదే నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ పకోడీల తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. పుట్ట గొడుగులతో అప్పుడప్పుడూ ఇలా పకోడీలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.