Shiny Hair : ప్రస్తుత తరుణంలో జుట్టు సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్నారు. అధిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల సమస్యలు వంటి కారణాల వల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీంతో జుట్టు రాలడం, జుట్టు కాంతిని కోల్పోవడం, అంద విహీనంగా మారి చిట్లడం, జుట్టు పెరగకపోవడం.. వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇందుకు గాను ఎలాంటి కెమికల్స్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరిపాలు, అవకాడో మిశ్రమం జట్టుకు మేలుచేస్తుంది. అవకాడో, కప్పు కొబ్బరిపాలను మిక్సీలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూను తేనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. తరువాత ఒక గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే.. జుట్టు నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. జుట్టు పట్టులా మారుతుంది.
బాగా మగ్గిన రెండు అరటి పండ్లు, రెండు టేబుల్స్పూన్ల ఆలివ్ నూనె, టేబుల్ స్పూను తేనెతో మాస్క్‌ను తయారుచేసుకోవాలి. ఈ మాస్క్‌ను కేశాలకు అప్లై చేస్తే కురులు సున్నితంగా మారతాయి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల లావెండర్ నూనె లేదా రోజ్ మేరీ నూనె కూడా కలపొచ్చు. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది. తిరిగి పూర్వపు రూపాన్ని పొందుతుంది. అలాగే గుడ్డు పచ్చసొన, తేనె, కొబ్బరినూనెతో తయారుచేసుకున్న హెయిర్‌మాస్క్ వెంట్రుకలకు తేమ, ప్రొటీన్లను అందించి కురులను మెరిసేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు రాసుకున్న 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతాయి.
మామిడి పండు, మామిడి ఆకుల హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు బాగానే పనిచేస్తుంది. ఇందుకు గాను కొన్ని మామిడి ఆకులు, పచ్చి మామిడి పైన పచ్చని తొక్కను తీసుకుని మిక్సీలో రుబ్బి పేస్ట్ లాగా చేసుకోవాలి. నీటికి బదులుగా ఈ పేస్ట్ లో ఏదైనా నూనెని వాడాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చాలా సమయం ఎండలో ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుభ్రం చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి అందంగా సహజమైన నల్లని జుట్టు పొందవచ్చు. తరచూ ఈ చిట్కాలను పాటిస్తుంటే జుట్టు అందంగా మారడమే కాకుండా నల్లగా ఉంటుంది. చుండ్రు ఉండదు. శిరోజాలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.