Caramel Popcorn : థియేటర్లలో మనకు ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో పాప్ కార్న్ కూడా ఒకటి. పాప్ కార్న్ ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా మనకు వివిధ రుచుల్లో కూడా ఈ పాప్ కార్న్ లభిస్తుంది. అందులో కారమెల్ పాప్ కార్న్ కూడా ఒకటి. ఈ కారమెల్ పాప్ కార్న్ కూడా చాలా రుచిగా ఉంటుంది. బయట అధిక ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా వీటిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కారమెల్ పాప్ కార్న్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారమెల్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ సీడ్స్ – పావు కప్పు, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పంచదార – రెండున్నర కప్పులు, ఉప్పు – చిటికెడు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, వంటసోడా – 2 చిటికెలు.
కారమెల్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా అడుగు భాగం మందంగా వెడల్పుగా ఉండే ఒక కళాయిని తీసుకోవాలి. అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కార్న్ సీడ్స్ ను వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. కార్న్ సీడ్స్ రంగు మారి పాప్ కార్న్ గా మారడం మొదలవగానే కళాయిపై మూత పెట్టాలి. పాప్ కార్న్ అంతా తయారవగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వెడల్పుగా ఉండే ఒక కళాయిని అందులో పంచదార వేసి వేడి చేయాలి. ఈ పంచదారను పెద్ద మంటపై పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి పాకం తయారయిన తరువాత ఉప్పు, బటర్ వేసి కలపాలి.
తరువాత వంటసోడా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే ముందుగా తయారు చేసిన పాప్ కార్న్ ను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ పాప్ కార్న్ ను పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. పాప్ కార్న్ చల్లగా అయిన తరువాత వీటిని విడివిడిగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారామెల్ పాప్ కార్న్ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఇలా ఎంతో రుచిగా కారామెల్ పాప్ కార్న్ ను తయారు చేసుకుని తినవచ్చు.