Jaggery With Milk : బెల్లం ఒక తియ్యటి పదార్థం. దీనిని సాధారణంగా చెరుకు రసం నుండి తయారు చేస్తారు. బెల్లాన్ని ఎక్కువగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాల్లో ఉపయోగిస్తారు. తాటి, జీలుగ చెట్ల నుండి కూడా బెల్లాన్ని తయారు చేస్తారు. చెరుకు రసాన్ని కాగబెట్టి బెల్లాన్ని తయారు చేస్తారు. ఈ బెల్లం నేల స్వభావాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగా, నల్లగా, మెత్తగా, గట్టిగా ఉంటుంది. బెల్లం స్వభావాన్ని బట్టి దానికి ధరను నిర్ణయిస్తారు. గట్టిదనాన్ని బట్టి రైతు పరిభాషలో రాపు లేదా జేడు అంటారు. ఈ బెల్లం తియ్యదనంలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ముందుంటుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదార కంటే బెల్లం ఎంతో శ్రేష్టమైనది. బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. భారతీయ వంటల్లో బెల్లం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తియ్యని పిండి వంటకాల తయారీలో కొందరు పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉయోగిస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏది ఉన్నా లేకున్నా తప్పకుండా చిన్న బెల్లం ముక్కను ఉంచుతారు. ఆయుర్వేదంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. బెల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఇటీవలి అధ్యయనాల ద్వారా వెల్లడైంది. నెలసరి సమయంలో స్త్రీలల్లో వచ్చే కడుపునొప్పిని తగ్గించడంలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
నెలసరి సమయంలో స్త్రీలు వేడి పాలల్లో బెల్లాన్ని వేసి బాగా కలపి తాగాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గడంతో పాటు నెలసరి కూడా క్రమం తప్పకుండా వస్తుంది. అంతేకాకుండా బెల్లంలో రక్తహీనతను దూరం చేసే గుణాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పాలల్లో బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బెల్లం కలిపిన వేడి పాలల్లో సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల శరీరంలో అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ లు, బ్యాక్టీరియాలు నశిస్తాయి. దీని వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్ లు తగ్గడంతో పాటు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కూడా కరిగిస్తుంది.
ఇలా బెల్లం కలిపిన వేడి పాలను తాగడం వల్ల జుట్టు కాంతివంతంగా మారడమే కాకుండా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు కూడా నయం అవుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పొడి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లాస్ బెల్లం పానకంలో తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. అజీర్తితో బాధపడే వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి సమస్య నయం అవుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. కాకర ఆకులు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 మిరియాల గింజలు,చి న్న బెల్లం ముక్కను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి.
నెయ్యితో బెల్లాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట పట్టులా వేస్తే నొప్పి తగ్గుతుంది. ముక్కు కారడంతో ఇబ్బంది పడుతున్న వారు పెరుగులో బెల్లాన్ని కలిపి రెండు పూటలా తీసుకోవడం వల్ల సమస్య తగ్గు ముఖం పడుతుంది. బెల్లం, నెయ్యిని సమపాళ్లల్లో కలిపి తింటే ఐదు నుండి ఆరు రోజుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, ఎసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతుల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన ప్రతిసారి బెల్లం ముక్కను తినడం వల్ల అసిడిటి సమస్యను తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నందునే బెల్లాన్ని మెడిసినల్ షుగర్ గా వ్యవహరిస్తారు. పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని బెల్లాన్ని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.