Roti : మనం ఆహారంలో భాగంగా రోటీలను కూడా తయారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. రోటీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రోటీలను తయారు చేయడానికి మనం రోటీ కర్రను ఉపయోగిస్తూ ఉంటాం. రోటీ కర్రను ఉపయోగించకుండా కూడా మనం రోటీలను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన రోటీలు మెత్తగా ఉండడంతో పాటు వీటిని నిల్వ కూడా చేసుకోవచ్చు. రోటీ కర్రతో పని లేకుండా రోటీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక కప్పు.
రోటి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, పంచదార, నూనె వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఒక నాన్ స్టిక్ కళాయిని కానీ నాన్ స్టిక్ తవాను కానీ తీసుకుని వేడి చేయాలి. తవా కొద్దిగా వేడవ్వగానే రోటీ పిండిని వేసి గంటెతో దోశలాగా రుద్దుకోవాలి. ఈ రోటీని గంటెతో కానీ కాటన్ వస్త్రంతో కానీ వత్తుకుంటూ రోటీ పొంగేలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత రోటీని కాటన్ వస్త్రంలోకి తీసుకోవాలి.
ఇలా కాల్చుకున్న తరువాత తవాపై నీటిని చల్లి తడి వస్త్రంతో తుడుచుకుని మరలా రోటీని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా, రుచిగా ఉండే రోటీలు తయారవుతాయి. ఈ రోటీలను మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఏ కూరలతో తిన్నా కూడా ఈ రోటీలు చాలా రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న రోటీలను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని కూడా తినవచ్చు. ఈ రోటీలు ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల 20 నుండి 25 రోజలు పాటు తాజాగా ఉంటాయి.