Cauliflower Masala Curry : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది అంతగా ఇష్టపడరు. కారణం.. దీన్నుంచి వచ్చే వాసననే అని చెప్పవచ్చు. అందువల్లే కాలిఫ్లవర్‌ను తినేందుకు చాలా మంది విముఖతను వ్యక్తం చేస్తుంటారు. అయితే వాస్తవానికి కూరగాయల్లో కాలిఫ్లవర్ ఎంతో ఉత్తమమైందని చెప్పవచ్చు. ఎందుకంటే.. దీనిలో అనేక పోషకాలతోపాటు ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. కనుక కాలిఫ్లవర్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక దీంతో మసాలా కర్రీ చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది అంటే ఇష్టం లేని వారు కూడా ఈ కూరను తింటారు. ఇక కాలిఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలి ఫ్లవర్ పెద్దది – 1, నూనె – 4 పెద్ద స్పూన్లు, ఉల్లిపాయలు – 4, వెల్లుల్లి – 6 రెబ్బలు, గసగసాలు – అర టీస్పూన్, జీడిపప్పు – 8, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, లవంగాలు – 2, దాల్చిన చెక్క – చిన్న ముక్క, జీలకర్ర – ముప్పావు టీస్పూన్, ఉప్పు, పసుపు సరిపడా.
కాలిఫ్లవర్ మసాలా కర్రీని తయారు చేసే విధానం..
ఉల్లిపాయల తరుగు, వెల్లుల్లిని కలిపి ముద్దగా నూరాలి. మిగిలిన మసాలాలు అన్నీ కలిపి ఒక ముద్దలా రుబ్బాలి. కాలి ఫ్లవర్ ని కట్ చేసి ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటిలో ఒక పావు గంటపాటు నాననివ్వాలి. తరువాత నీటిలో నుండి కాలి ఫ్లవర్ ముక్కలను తీసి నూరి ఉంచిన మసాలా ముద్దలో సగం ముక్కలకు పట్టించాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత మిగిలిన మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కాలి ఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి సన్నని మంట మీద మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో రుచికరమైన కాలిఫ్లవర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీన్ని రోటీల్లోకి తింటే చాలా బాగుంటుంది. అన్నంతో కూడా తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి.