Atukula Karapusa : పండుగ వచ్చిందంటే చాలు.. చాలా మంది అప్పాలను తయారు చేస్తుంటారు. తెలంగాణలో దసరాకు.. ఆంధ్రాలో సంక్రాంతికి అప్పాలను వండుతారు. ఈ క్రమంలోనే చెక్కలు, సకినాలు, అరిసెలు.. ఇలా రకరకాల తిను బండారాలను వండుతుంటారు. అయితే అలా వండే వాటిలో కారపూస కూడా ఒకటి. దీన్ని సాధారణంగా బియ్యం పిండితో తయారు చేస్తారు. కానీ అటుకులతో కూడా కారపూసను తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి, అటుకులు – ఒక్కో కప్పు చొప్పున, కారం – ఒక టీస్పూన్, నువ్వులు – రెండు టీస్పూన్లు, వాము – ఒక టీస్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత.
అటుకుల కారపూసను తయారు చేసే విధానం..
అటుకుల్లో నీళ్లను పోసి కాసేపు నానబెట్టి నీటిని వంచేయాలి. తరువాత వీటిని మెత్తని పేస్టులా చేయాలి. గిన్నెలో బియ్యం పిండి, అటుకుల పేస్టు, మిగితా పదార్ధాలన్నీ వేయాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ మిశ్రమాన్ని ముద్దలా కలపాలి. జంతికల గొట్టంలో కాస్త నూనె రాసి పిండి మిశ్రమాన్ని పెట్టాలి. కడాయిలో నూనె పోసి వేడి చేసి కారపూస వేయాలి. వీటిని మధ్యస్థంగా ఉండే మంట మీద రెండు వైపులా వేయించి తీయాలి. కొన్ని కారపూసలను సన్నగా, మరికొన్నింటిని కాస్త లావుగా వేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండగకి ఇలా ఒకసారి అటుకులతో కారపూస తయారు చేసి తిని చూడండి. మీరు ఇక విడిచిపెట్టరు.