Egg Masala Curry : కోడిగుడ్లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా కోడిగుడ్డును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కోడిగుడ్లతో చేసే వంటకాల్లో మసాలా కర్రీ కూడా ఒకటి. కోడిగుడ్లతో మసాలా కర్రీని దాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కచ్చా పచ్చగా దంచిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, టమాట ఫ్యూరీ – అర కప్పు, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ముప్పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – 2 టీ స్పూన్స్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 5, యాలకులు – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – ఒక టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్.
ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేయాలి. ఈ కోడిగుడ్లను వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీని వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును, ఉప్పును, కారాన్ని, పసుపును వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పెరుగును టమాట గుజ్జు వేగిన తరువాత అందులో వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి కలపాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే వేయించిన కోడిగుడ్లను కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఫ్రెష్ క్రీమ్, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.