Betel Leaves : హిందూ సాంప్రదాయంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుభకార్యానికి వచ్చిన ప్రతి అతిథికి కూడా తాంబూలాన్ని ఇవ్వడం ఆనవాయితీ. తాంబూలంగా ఇచ్చే వాటిల్లో తమలపాకు కూడా ఒకటి. కొందరు దేవుళ్లకు కూడా తమలపాకులతో పూజలు చేస్తుంటారు. కేవలం పూజలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా తమలపాకు ఎంతగానో మేలు చేస్తుంది. తమలపాకులలో ఎముకలకు మేలు చేసే క్యాల్షియంతోపాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి లు కూడా ఉన్నాయి. దీనిని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పీచు పదార్థాలు కూడా తమలపాకులో పుష్కలంగా ఉంటాయి.
ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతకంటే ఎక్కువ మేలు చేస్తాయి. తమలపాకు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను దరి చేరకుండా చేయడంలో కూడా తమలపాకు మనకు ఎంతగానో సహాయపడుతుంది. నూనెలు, ఇతర తైల పదార్థాలు ఆక్సీకరణానికి గురి అయ్యి చెడిపోవడాన్ని ర్యాంప్సిడిటీ అంటారు. తమలపాకులు నూనెలు ఆక్సీకరణం చెందే ఈ ప్రక్రియను అడ్డుకుంటాయి. నువ్వుల నూనె, ఆవ నూనె, వేరుశనగ నూనె, పొద్దు తిరుగుడు నూనె, ఆముదం నూనె వంటివి పాడవకుండా ఉండాలంటే వాటిలో తమలపాకులను వేసి నిల్వ చేయాలి.

బ్యాక్టీరియాలను, ఫంగస్ లను నశింపజేసే గుణం కూడా తమలపాకుకు ఉంది. తమలపాకును తొడిమతో కలిపి తింటే స్త్రీలల్లో వంధత్వం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనుక సంతానం కోసం ప్రయత్నించే స్త్రీలు మాత్రం తమలపాకుకు ఉన్న తొడిమను తీసి వాడుకోవాలి. ఔషధంగా తమలపాకును వాడుకోవాలనుకున్న వారు తమలపాకు రసాన్ని ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజూ ఏడు తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోధ వ్యాధితో బాధపడే వారు చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఊబకాయంతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక తమలపాకును పది గ్రాముల మిరియాలతో కలిపి తిని వెంటనే నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయంతో బాధపడే వారు సన్నగా నాజుగ్గా తయారవుతారు.
తమలపాకు రసాన్ని కళ్లల్లో వేసుకోవడం వల్ల రేచీకటి సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చెవుల మీద తమలపాకులను ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల తలలో చేరిన వాతం తగ్గి తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో వచ్చే క్షణికావేశాలు తగ్గుతాయి. గుండె అపసవ్యంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతూ ఉంటే హితకరంగా ఉంటుంది. తమలపాకు షర్బత్ ను తాగడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. బాలింతలు ఏ కారణం చేత అయిన పిల్లలకు పాలు ఇవ్వలేనప్పుడు స్థనాల్లో పాలు గడ్డలుగా మారి నొప్పిని కలుగజేస్తుంటాయి.
అలాంటప్పుడు తమలపాకును వేడి చేసి స్థనాలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గి నొప్పి నుండి ఉపవమనం కలుగుతుంది. తరచూ జలుబుతో బాధపడే చిన్న పిల్లలకు వారి ఛాతిపై వేడి చేసిన తమలపాకుకు ఆముదాన్ని రాసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లల్లో జలుబు తగ్గుతుంది. పాటలు పాడే వారు, ఉపన్యాసాలు ఇచ్చే వారు తమలపాకు కాడను నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ రసాన్ని మింగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. తమలపాకును తినడం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది.
జ్వరంతో బాధపడే వారు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడు పూటలా మిరియాల పొడితో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకును వేడి చేసి కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తమలపాకును పేస్ట్ గా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గు ముఖం పడుతుంది. ఈ విధంగా తమలపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.