Gas Trouble : నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అసిడిటీ సమస్య ఒకటి. కడుపులో ఖాళీ ఏర్పడడం వల్ల ఆ ఖాళీ ప్రదేశంలోకి గాలి చేరి అది గ్యాస్ గా మారి పొట్ట చుట్టు పక్కల భాగాలను బాధించడం మొదలు పెడుతుంది. ఈ అసిడిటీ వల్ల కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అసిడిటీ సమస్యను తగ్గించే వివిధ రకాల మందులు మార్కెట్ లో ఉన్నప్పటికీ అవి మనకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ అవి అసిడిటీ సమస్యను శాశ్వతంగా దూరం చేయవు. మన ఇంట్లో పదార్థాలతో అసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అసిడిటీ సమస్యను తగ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణక్రియకు సహాయపడే జీర్ణరసాలు అధికమైనా లేదా తక్కువగా ఉన్నా అవి కడుపు నొప్పికి కారణమవుతాయి. వాటి వల్ల అసిడిటీ, గ్యాస్, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది అన్ని వయసుల వారిలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్య. మసాలా కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి, మద్యం సేవించడం వంటి వాటిని అసిడిటీ సమస్య రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. అసిడిటీ వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గించడంలో చల్లటి పాలు అద్భుతంగా పని చేస్తాయి.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ చల్లటి పాలను తాగడం వల్ల అసిడిటీ వల్ల కలిగే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. పొట్టను చల్లగా ఉంచుతుంది. అదేవిధంగా గోరు వెచ్చని గ్రీన్ టీ లో నిమ్మరసాన్ని కలుపుకుని తాగినా కూడా అసిడిటీ సమస్య నుండి బయటపడవచ్చు. అసిడిటీ వల్ల కలిగే కడుపు నొప్పితో బాధపడే వారు అన్నాన్ని వార్చగా వచ్చే గంజిలో కొద్దిగా ఉప్పును కలిపి తాగడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా గంజి తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య వల్ల వచ్చే కడుపు నొప్పి తగ్గడంతోపాటు అసిడిటీ సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది. ఇలా నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీతో బాధపడే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల అసిడిటీ సమస్య నుండి ఉపశమనాన్ని పొందడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.