Atti Patti Mokka : అత్తిపత్తి మొక్క.. ముట్టుకోగానే ముడుచుకుపోయే మొక్క. దీనికి సిగ్గాకు, నిద్రగన్నిక, నిద్ర భంగి అనే పేర్లు కూడా కలవు. ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క ఎక్కువగా తేమ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ అత్తిపత్తి మొక్క ప్రత్యేకమైన లక్షణంతో పాటు ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించి మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. దీనిని సంస్కీతంలో లజ్జాకు అని, హిందీలో చుయి ముయి అని, ఇంగ్లీష్ లో టచ్ మీ నాట్ అని పిలుస్తారు.
ఈ మొక్కను తాకినప్పుడు ఆకుల్లో ఉండే నీరు కాండంలోకి వెళ్లిపోతుంది. దీంతో ఆకు వాలిపోతుంది. మళ్లీ కొంత సమయానికి కాండంలోని నీరు ఆకుల్లోకి వస్తుంది. దీంతో తిరిగి ఆకులు తెరుచుకుంటాయి. సూర్యుడు ఆస్తమించిన తరువాత కూడా ఈ ఆకులు ముడుచుకుంటాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను వివిధ రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. వాతాన్ని హరించడంలో అత్తిపత్తి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ది చేయడంలో, మూత్రాన్ని సాఫీగా జారీ చేయడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది. ముక్కు నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. పాత వ్రణాలు మానేలా చేస్తుంది. బోధకాలు, మూల వ్యాధి, కామెర్లు, కుష్టు, విష జ్వరం, గుండె దడ, శ్వాస కోస సంబంధిత సమస్యలు, తుంటి నొప్పి, ఉబ్బ రోగం వంటి అనారోగ్య సమస్యలను కూడా అత్తిపత్తి మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
నపుంసకత్వంతో బాధపడే వారికి ఈ మొక్క ఎంతగానో దోహదపడుతుంది. పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను వాటి నాణ్యతను పెంచడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది. ముందుగా అత్తిపత్తి మొక్క ఆకులను సేకరించి వాటిని నీడలో ఎండబెట్టాలి. తరువాత ఈ ఆకులను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 3 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అత్తిపత్తి ఆకుల పొడి, తేనె మిశ్రమంలో అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ చెట్టు ఆకుల పొడిని 41 రోజుల పాటు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా గాయాలు తగిలిన ప్రదేశంలో ఈ ఆకుల రసాన్ని రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
అత్తిపత్తి మొక్క ఆకులను పేస్ట్ గా చేసి ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూటను మొలలపై పెడుతూ ఉంటే మొలల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అత్తిపత్తి ఆకుల పొడిని ఒక భాగం, పటిక బెల్లం పొడిని రెండు భాగాలుగా తీసుకుని ఈ రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ అర చెంచా మోతాదులో నీటిలో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నెలసరి సక్రమంగా వస్తుంది. చర్మ వ్యాధులతో బాధపడే వారికి కూడా అత్తిపత్తి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్తిపత్తి ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.