Maredu Akulu Benefits : మారేడు వృక్షం.. దీనినే బిళ్వ వృక్షం అని కూడా అంటారు. ఈ మొక్క గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ప్రత్యేకమైన పత్రాలను కూడా ఉపయోగిస్తారు. వాటిలో బిళ్వ పత్రం చాలా ప్రధానమైనది. మూడు ఆకులు గల బిళ్వ దళం త్రిమూర్తులకు ప్రతీకగా కూడా చెబుతారు. ఈ ఆకు లేనిదే శివ పూజ పూర్తి కాదు. శివున్ని పూజించినట్టుగానే ఈ చెట్టును కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బిళ్వ పత్రాలతో పూజిస్తే ఆది దేవుడికి ఆనందం కలుగుతుందని ఆయన కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. మారేడు ఆకులు పూజకే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మారేడు చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మారేడు పువ్వులు, ఆకులు చక్కటి వాసనను కలిగి ఉంటాయి.
మారేడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజూ పరగడుపున మూడు మారేడు ఆకులను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అతిసార వ్యాధికి మారేడు పండ్ల రసం దివ్యౌషధంగా పని చేస్తుంది. మొలల వ్యాధిని తగ్గించడంలో ఈ మొక్క వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. మారేడు ఆకుల రసం చక్కెర వ్యాధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ చెట్టు ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. మారేడు పండ్ల రసానికి అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఇక ఈ మారేడు ఆకులను, వేరును, బెరడును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఈచెట్టు ఆకులకు ఊబకాయాన్ని తగ్గించే శక్తి కూడా ఉందని పరిశోధనల్లో తేలింది. అధిక బరువుతో బాధపడే వారు ప్రతిరోజూ మారేడు ఆకులను తీసుకోవడం వల్ల అలవాటు చేసుకోవాలి. ఈ ఆకులను తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. మారేడు ఆకుల నుండి తీసిన రసాన్ని చర్మానికి రాసుకుని ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం నుండి చెడు వాసన రాకుండా ఉంటుంది.
మారేడు ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ప్రేగుల్లో వచ్చే అల్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని కొన్ని వారాల పాటు తాగడం వల్ల కడుపునొప్పి, కడుపులో వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మారేడు పండును తినడం వల్ల కూడా అల్సర్ల నుండి ఉపశమనం కలుగుతుంది. మారేడు చెట్టు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.