Usirikaya Pulihora : సాధారణంగా మనకు పులిహోర అంటే చింతపండు, మామిడి కాయలు, నిమ్మకాయలు వేసి చేసేది గుర్తుకు వస్తుంది. ఇవన్నీ భిన్న రకాల రుచులను కలిగి ఉంటాయి. అందులో భాగంగానే చాలా మంది వీటితో పులిహోర చేసుకుని తింటుంటారు. అయితే ఉసిరికాయలతోనూ పులిహోర చేయవచ్చు. ఇది కూడా ఇతర పులిహోరల మాదిరిగానే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సీజన్‌లో మనకు ఉసిరికాయలు బాగా లభిస్తాయి. కనుక వాటితో పులిహోర చేసుకుని తినాలి. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ పొందవచ్చు. ఇక ఉసిరికాయలతో పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయ ముక్కలు – ఒక కప్పు, పచ్చి మిర్చి – 4, ఆవాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, మినప పప్పు – ఒక టీస్పూన్, పచ్చి శనగ పప్పు – ఒక టీస్పూన్, ఎండు మిర్చి – 3, వేయించిన ఆవాలు, మెంతుల పొడి మిశ్రమం – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు, పల్లీలు – 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె – 3 టేబుల్ స్పూన్లు, అల్లం తురుము – 1 టీస్పూన్, పసుపు – తగినంత, ఉప్పు – తగినంత, ఇంగువ – కొద్దిగా, అన్నం – అర కిలో (పొడి పొడిగా ఉండేలా వండాలి).
ఉసిరికాయ పులిహోరను తయారు చేసే విధానం..
మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, ఆవాలు, పచ్చి శనగ పప్పు, మినప పప్పు, పల్లీలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. కరివేపాకు, ఇంగువ, అల్లం తురుము జత చేసి కొద్దిసేపు వేయించాలి. మిక్సీ పట్టిన ఉసిరి మిశ్రమం జత చేసి బాగా వేయించాలి. ఆవాలు, మెంతుల పొడి మిశ్రమం జత చేసి కొద్ది సేపు వేయించాలి. బాగా చల్లారిన అన్నం జత చేసి కలియబెట్టాలి. అప్పడాలతో అందిస్తే రుచిగా ఉంటుంది.దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. తరచూ చేసుకునే పులిహోరకు బదులుగా ఇలా ఉసిరికాయలతో పులిహోర చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.