Fat Reducing Tips : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చాలా తక్కువ మొత్తంలో ఇది మన శరీరానికి అవసరమవుతుంది. కణాల నిర్మాణానికి, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల తయారీలో, విటమనిం డి తయారీలో, శరీరం జీవక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. అయితే మన శరీరంలో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ రక్తంలో ద్రవ రూపంలో ఉంటుంది. దీనిలో ఎల్ డి ఎల్, హెచ్ డి ఎల్, ట్రై గ్లిజరాయిడ్స్ అనే మూడు రకాలు ఉంటాయి. ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ గా వ్యవహరిస్తారు. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. రక్తంలో దీని స్థాయిలు ఎక్కువవడం వల్ల హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా వ్యవహరిస్తారు. ఈ కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. గుండె పోటు తో ఇతర గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో ఈ కొలెస్ట్రాల్ మనకు ఉపయోగపడుతుంది. ఇక ట్రై గ్లిజరాయిడ్స్ అనేది రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. మనం తీసుకున్న ఆహారంలో అవసరం లేని క్యాలరీలను శరీరం ట్రై గ్లిజరాయిడ్స్ గా మారుస్తుంది. ఇవి కొవ్వు కణాల్లో నిల్వ చేయబడతాయి. శరీరంలో శక్తి కొరకు హార్మోన్లు ట్రై గ్లిజరాయిడ్స్ ను విడుదల చేస్తాయి. అయితే శరీరంలో అవసరానికి మించిన ట్రై గ్లిజరాయిడ్స్ ఉన్నా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మనం రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గాలంటే అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గాలి. బరువు తగ్గడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వాటంతట అవే తగ్గుతాయి.
అలాగే చక్కటి జీవన విధానాన్ని ఆచరించడం వల్ల కూడా మనం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మనం చాలా సులభంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అయితే కొందరిలో బరువు త్కువగా ఉన్నప్పటికి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. స్టాటిన్ అనే మందులను వాడడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి దీనిని 10 ఎమ్ జి నుండి 40 ఎమ్ జి వరకు వాడాల్సి ఉంటుంది. అయితే ఈ మందులను వైద్యున్ని సంప్రదించిన తరువాతే వాడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.