Motichoor Laddu Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మోతిచూర్ లడ్డూ ఒకటి. వీటి రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. చాలా మంది ఈ లడ్డూలను మనం ఇంట్లో తయారు చేసుకోవడం వీలు కాదు అని భావిస్తారు. కానీ కొద్దిగా ఓపిక ఉండాలే కానీ అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మోతిచూర్ లడ్డూలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మోతిచూర్ లడ్డూలను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోతిచూర్ లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – పావు కిలో, ఆరెంజ్ ఫుడ్ కలర్ – 2 చిటికెలు, నీళ్లు – పావు లీటర్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పంచదార – 400 గ్రా., యాలకుల పొడి – ఒక టీ స్పూన్, వేయించిన జీడిపప్పు – కొద్దిగా, నెయ్యి – 3 టీ స్పూన్స్, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
మోతిచూర్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మోతిచూర్ లడ్డును తయారు చేయడానికి కావల్సిన చిల్లుల గంటెను తీసుకుని అందులో ఒకే దగ్గర పిండిని వేస్తూ చేత్తో కానీ గంటెతో కానీ కలపాలి. తరువాత ఈ బూందీని పెద్ద మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బూందీని కాల్చుకున్న తరువాత కళాయిలో పంచదారను, 300 ఎమ్ ఎల్ నీటిని పోసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చిన తరువాత అందులో నిమ్మరసం, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న బూందీని వేసి బూందీ పంచదార మిశ్రమం అంతా కలిసేలా బాగా కలపాలి. బూందీ పంచదార మిశ్రమాన్ని పీల్చుకుని దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై టిష్యూ పేపర్ లను ఉంచి మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
బూందీ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత అందులో యాలకుల పొడి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి. చేతికి నెయ్యి రాసుకుంటూ తగిన పరిమాణంలో బూందీ మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే మోతిచూర్ లడ్డూలుతయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. బూందీ పంచదార మిశ్రమాన్ని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించకపోతే లడ్డూ చుట్టుకోవడానికి రాదు. ఈ లడ్డూలను తయారు చేయడానికి సన్నని చిల్లులు ఉన్న జల్లి గంటెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్పుడప్పుడూ మోతిచూర్ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.