Potato Pickle Recipe : ఆలుగడ్డలను సహజంగానే చాలా మంది తరచూ కూరల రూపంలో తింటుంటారు. వీటితో వేపుళ్లు, టమాటా కూర, పులుసు చేస్తుంటారు. అలాగే కొందరు పులావ్, బిర్యానీ వంటి వాటిలో కూడా బంగాళా దుంపలను ముక్కలుగా కట్ చేసి వేస్తుంటారు. ఇక కొందరు ఆలు చిప్స్ అంతే తెగ ఇష్టంగా తింటారు. అయితే ఆలుగడ్డలతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా పెట్టుకోవచ్చు. ఇతర పచ్చళ్లలాగే ఈ పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. దీన్ని పెట్టుకోవడం కూడా సులభమే. ఆలు పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళా దుంపలు – 3, కారం – పావు కప్పు, ఉప్పు – తగినంత, ఆవ పిండి – పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, మెంతి పిండి – పావు టీస్పూన్, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు.
ఆలు పచ్చడిని తయారు చేసే విధానం..
బంగాళా దుంపలను పొట్టు తీసి మధ్యస్థంగా ఉండేలా ముక్కలు చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రం మీద వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడి చేసి ఆలు గడ్డ ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. ఇదే నూనెను బాగా చల్లార్చి ఉప్పు, కారం, పసుపు, ఆవ, మెంతిపొడి, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం అన్నీ వేసి బాగా కలపాలి. దీంట్లో బంగాళా దుంపలనువేయాలి. రెండో రోజున కూడా ఈ మిశ్రమాన్ని మళ్లీ కలపాలి. మూడో రోజున ఈ పచ్చడిని తినవచ్చు. ఇది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. అన్నం లేదా చపాతీలు.. ఏవైనా సరే.. ఈ పచ్చడిని వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఆలుగడ్డలతో తరచూ చేసే వంటలకు బదులుగా ఇలా పచ్చడిని పెట్టుకుని ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.