Egg Karam Dosa : మనం ఉదయం పూట అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన రుచికి తగ్గటు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం ను దోశను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – ఒక కప్పు, బియ్యం – రెండున్నర కప్పులు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – అర కప్పు, ఎండుమిర్చి – 100 గ్రా., చింతపండు – 5 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 15, ఉప్పు తగినంత, నూనె – 75 ఎమ్ ఎల్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు.
రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ తయారీ విధానం..
ముందుగా మినపగుళ్లు, బియ్యం, మెంతులు, అటుకులను 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని దోశ పిండిని తయారు చేసుకోవాలి. ఈ పిండిని ఒక రాత్రంతా పులియ బెట్టాలి. తరువాత ఒక జార్ లో ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దోశ పిండిని తీసుకుని పలుచగా దోశ వేసుకోవాలి.
తరువాత దీనిపై రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. దోశ పై పిండి ఆరి మధ్యలో ఎర్రగా అయిన తరువాత దీనిపై ఒక టీ స్పూన్ వేయించిన కారాన్ని వేసి ఒక కోడిగుడ్డును వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ దోశ అంతా వచ్చేలా రాయాలి. తరువాత దోశ అంచుల వెంబడి మరో టీ స్పూన్ నూనె వేయాలి. గుడ్డు వేసేటప్పుడు మంట మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దోశను ఒక నిమిషం పాటు కాల్చుకుని మరో వైపుకు తిప్పాలి. దీనిని మరో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే ఎగ్ దోశ కంటే ఈ విధంగా తయారు చేసిన ఎగ్ కారం దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.