Pakam Puri : పాకం పూరీలు.. ఈ వంటకం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పూరీలు తియ్యగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారిగా చేసే వారు కూడా వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ పాకం పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాకం పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పంచదార – అర కిలో, నీళ్లు – 150 ఎమ్ ఎల్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పాకం పూరీలు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత అందులో నెయ్యి, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి.తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి ముదురు తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పలుచగా పూరీలా వత్తుకోవాలి.
తరువాత ఈ పూరీపై పావు టీ స్పూన్ నెయ్యి వేసి పూరీ అంతా వచ్చేలా రాసుకోవాలి. తరువాత ఈ పూరీని మధ్యలోకి మడవాలి. మరలా కోన్ ఆకారం వచ్చేలా మరొకసారి మధ్యలోకి మడవాలి. ఇలా తయారు చేసుకున్న మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వత్తుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక వత్తుకున్న పూరీని వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దీనిని నూనె నుండి తీసిన వెంటనే ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో వేయాలి. ఈ పూరీని 30 సెకన్ల పాటు పంచదార పాకంలో అలాగే ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు తయారవుతాయి.
ఈ విధంగా తయారు చేసిన పూరీలు వేడిగా ఉన్నప్పుడు ఒక రుచి అలాగే చల్లారిన తరువాత మరో రుచిని కలిగి ఉంటాయి. ముదురు పాకంలో వేయడం వల్ల పూరీలను 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పూరీలను లేత పంచదార పాకంలో కూడా వేసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాగే ఈ పూరీల తయారీలో మైదాపిండికి బదులుగా గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు తయారవుతాయి. అప్పుడప్పుడు ఇలా పాకం తయారు చేసుకుని తినవచ్చు.