Ulavala Vepudu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పప్పు దినుసుల్లో ఉలవలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తినడం లేదు. కానీ మన పెద్దలు, పూర్వీకులు ఒకప్పుడు వీటినే తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. వాస్తవానికి ఉలవలను మనం కూడా తినవచ్చు. దీంతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరం దృఢంగా మారుతుంది. ఎంత పనిచేసినా అలసిపోరు. శరీరానికి అమితమైన శక్తి లభిస్తుంది. బలంగా మారుతారు. అయితే ఉలవలతో చాలా మంది చారు చేస్తుంటారు. అదేకాకుండా ఉలవలతో మనం వేపుడును కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. ఉలవలతో వేపుడును ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉలవలు – ఒక కప్పు, ఎండు మిర్చి -3, ఆవాలు – ఒక టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 4 రెబ్బలు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లి తరుగు – అర కప్పు చొప్పున, జీలకర్ర, కారం – అర టీస్పూన్ చొప్పున, పసుపు – పావు టీస్పూన్.
ఉలవల వేపుడును తయారు చేసే విధానం..
ఉలవలను 6 గంటలపాటు నానబెట్టి తగినంత నీరు, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తరువాత నీరు వడకట్టాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, ఉల్లి తరుగు, జీలకర్ర, కారం, పసుపు కలిపి బరకగా దంచుకోవాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి కొబ్బరి మిశ్రమం కలపాలి. రెండు నిమిషాల తరువాత ఉడికించిన ఉలవలతోపాటు కొద్దిగా వడకట్టిన నీరు చల్లి చిన్న మంటపై మూత పెట్టి మగ్గించాలి. నీరు ఆవిరై ఉలవలు పొడి పొడిగా అయ్యాక దించేయాలి. దీంతో ఎంతో రుచికరమైన ఉలవల వేపుడు రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.