Vankaya Majjiga Charu : మనం పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనందరికి తెలుసు. ఈ పెరుగును నేరుగా తీసుకోవడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారును కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే కేవలం మజ్జిగ చారే కాకుండా దీనిలో వంకాయలను వేసి మరింత రుచిగా వంకాయ మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వంకాయలను వేసి చేసే ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులువుగా వంకాయ మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ మజ్జిగ చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, పెరుగు – అర లీటర్, నీళ్లు – ఒక గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
వంకాయ మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు నీటిలో వేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత పెరుగును ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వంకాయ ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను పూర్తిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న మజ్జిగను, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకుని వేయించాలి.
తాళింపు తయారైన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ చారులో వేసి కలపాలి. చివరగా కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండేవంకాయ మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మజ్జిగ చారును తయారు చేసి తీసుకోవడం వల్ల వంకాయల్లో ఉండే పోషకాలను పొందడంతో పాటు మజ్జిగను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వంకాయలతో ఇలా మజ్జిగ చారును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా ఒక చుక్క మజ్జిగను కూడా విడిచి పెట్టకుండా ఈ మజ్జిగ చారును తింటారు.