Basbousa Cake : బస్బూసా కేక్.. ఈ కేక్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈజిప్ట్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. బస్బూసా కేక్ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కేక్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేత రుచిగా ఉంటుంది. ఈ కేక్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. తరచూ మనం చేసేచరవ్వ కేక్ కంటే కొద్దిగా భిన్నంగా ఈ కేక్ తయారీ ఉంటుంది. బస్బూసా కేక్ ను చక్కగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బస్బూసా కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – 3 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 4, బటర్ – 125 గ్రా., పంచదార – 125 గ్రా., ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు, మైదా పిండి – 100 గ్రా., బేకింగ్ సోడా – ఒక టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్.
షుగర్ సిరప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – 100 గ్రా., నీళ్లు – 150 ఎమ్ ఎల్, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క.
బస్బూసా కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బటర్ ను వేసి పూర్తిగా కరిగించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో పంచదారను తీసుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగే వరకు గంటెతో బాగా కలుపుకోవాలి.తరువాత ఇందులో జల్లెడను ఉంచి మైదా పిండి, రవ్వ, బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. తరువాత ఒకే దిశలో ఇవి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి, వెనీలా ఎసెన్స్ వేసి మళ్లీ అదే దిశలో అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెకు నెయ్యి రాసి అందులో కేక్ మిశ్రమాన్ని వేసుకుని గిన్నెను తట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే గాలి బుడగలు పోతాయి.
ఇప్పుడు ఈ గిన్నెను ఫ్రీ హీట్ చేసుకున్న ఒవెన్ లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒవెన్ అందుబాటులో లేని వారు దీనిని కుక్కర్ లో ఉడికించుకోవచ్చు. కుక్కర్ లో ఒక స్టాండును ఉంచి దానిపై విజిల్ లేకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత మూత తీసి అందులో కేక్ గిన్నెను ఉంచి విజిల్ లేకుండామరలా మూత పెట్టాలి. దీనిని 30 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. కేక్ ఉడుకుతుండగా మరో గిన్నెలో పంచదార, నీళ్లు, దాల్చిన చెక్క వేసి వేడి చేయాలి. దీనిని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నెను బయటకు తీసి దానిపై టూత్ పిక్ తో ఒక ఇంచు దూరంతో చిన్న చిన్న రంధ్రాలు చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ను కేక్ అంతా కొద్దిగా వేసుకోవాలి.
10 నిమిషాల పాటు ఆగిన తరువాత మరో సారి షుగర్ సిరప్ ను వేసుకోవాలి. ఇలా మూడు సార్లు షుగర్ సిరప్ ను వేసుకున్న తరువాత కేక్ ను గిన్నె అంచుల నుండి వేరు చేయాలి. తరువాత దీనిని మరో ప్లేట్ లోకి తీసుకుని కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బస్బూసా కేక్ తయారవుతుంది. దీనిని మనం డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. క్రిస్మస్ కు, న్యూఇయర్ కు ఇలా ఇంట్లోనే కేక్ ను తయారు చేసుకుని తినవచ్చు. తరచూ చేసే రవ్వ కేక్ కంటే ఇలా చేసిన బస్బూసా కేక్ మరింత రుచిగా ఉంటుంది. ఒక ముక్క కేక్ ను కూడా విడిచి పెట్టకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు.