Hibiscus Flower : మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల మొక్కల్లో మందార మొక్కలు ఒకటి. వీటిని చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పూలు వివిధ రంగుల్లో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు మన జుట్టు సంరక్షణలో ఎంతగానో ఉపయోగపడతాయని మనందరికి తెలుసు. మందార పువ్వులను, మందార ఆకులను తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే మందార పువ్వులను ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. కేవలం మందార పువ్వు మన కేశ సంరక్షణలోనే కాదు మన ఆరోగ్యాన్ని సంరక్షిచండంలో కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మందార పువ్వులతో చేసిన టీ ని తాగడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మందార పువ్వులతో టీ ని చేసుకుని తాగవచ్చని సంగతి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ వివిధ దేశాల్లో మందార పువ్వుల టీ ఎంతో కాలంగా వాడుకలో ఉంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మందార పువ్వుల టీ ని ఎలా తయారు చేసుకోవాలి… అలాగే ఈ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మందార పువ్వుల్లో చాలా రకాలు ఉన్నప్పటికి ఒంటి రెక్క ఎర్ర మందారాల్లోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేద ఔషధాల్లో కూడా ఈ పూలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ టీ ని తయారు చేసుకోవడానికి మూడు ఒంటిరెక్క ఎర్ర మందారాలను తీసుకుని వాటి రేకులను వేరు చేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా మరిగించాలి.
నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మందార పూల రేకులను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మందార టీ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న టీ లో అర చెక్క నిమ్మరసాన్ని అలాగే రుచికి కొరకు బెల్లాన్ని లేదా తేనెను వేసుకోవచ్చు. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు మాత్రం ఇందులో తేనెను, బెల్లాన్ని కలపకుండా తీసుకోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న మందార టీ లో విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ , ప్లవనాయిడ్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఈ మందార టీ నిప్రతిరోజూ తాగడం వల్ల చర్మం పై ముడతలు రాకుండా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.
ఈ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ మందార టీ ని తాగడం వల్ల చాలా సులభంగా, చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. షుగర్ వ్యాధితో బాధపడే వారు అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ టీని రోజుకు రెండు పూటలా తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ టీని తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడే వారు మందార పూల టీ ని తాగడం వల్ల మూత్రపిండాల సమస్యల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఈ టీ ని తాగడం వల్ల మనం ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
అలాగే మందార టీ ని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాలు చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు ఈ టీని తాగడం వల్ల దాహం తీరడంతో పాటు శరీరం కూడా చల్లబడుతుంది. ఈ విధంగా మందార పూలతో చేసిన టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ టీ ని రోజూ తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.