Paneer Korma : మనం ఎంతో ఇష్టంగా తినే ఆహారాల్లో పనీర్ కూడా ఒకటి. పాలతో దీన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా చికెన్, మటన్ కన్నా ప్రోటీన్లు ఇందులోనే ఎక్కువగా ఉంటాయి. కనుక మాంసాహారం తినని వారికి ప్రోటీన్ల కోసం ఇది చక్కని ఆహారం అని చెప్పవచ్చు. సాధారణంగా మనకు పనీర్ కేవలం విందులు, వివాహాది శుభకార్యాల్లోనే లభిస్తుంది. లేదంటే రెస్టారెంట్లలో తినవచ్చు. అయితే పనీర్‌ను మనం ఇంట్లోనూ వివిధ రకాలుగా వండుకోవచ్చు. కాస్త శ్రమించాలే కానీ.. పనీర్‌తో ఎంతో రుచికరమైన కుర్మాను రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చేయడం సులభమే. పనీర్ కుర్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 250 గ్రాములు, నూనె – 5 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 1 కప్పు (సన్నగా తరగాలి), జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూన్లు, టమాటాలు – 1 కప్పు (సన్నగా తరగాలి), నీళ్లు – తగినన్ని, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – 3 చిన్న ముక్కలు, లవంగాలు – 7, ఆకుపచ్చని యాలకులు – 2, జాపత్రి – 2, నల్ల మిరియాలు – అర టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – 1 టేబుల్ స్పూన్, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – అర టేబుల్ స్పూన్, కసూరీ మేథీ – 1 టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – 3, కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్ (తరిగినది).
పనీర్ కుర్మాను తయారు చేసే విధానం..
ఒక పాన్ తీసుకుని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత అందులో ఉల్లిపాయలను వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మెత్తగా అవగానే జీడిపప్పు వేసి వేయించాలి. కొద్ది సెకన్లపాటు వేయించిన తరువాత ఈ మిశ్రమాన్ని ఇంకో ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు టమాటాలను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. మెత్తని పేస్ట్‌లా మారే వరకు టమాటాలను మిక్సీ పట్టి తరువాత ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అనంతరం చల్లారిన ఉల్లిపాయల మిశ్రమాన్ని తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా పట్టుకోవాలి. కాస్త నీళ్లు, పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా పట్టాలి. దీంతో కూరకు కావల్సిన గ్రేవీ రెడీ అవుతుంది. ఇది కూర రుచిని పెంచుతుంది.
ఇప్పుడు పాన్ తీసుకుని అందులో మరి కాస్త నూనె వేసి కాగిన తరువాత దాల్చిన చెక్కలు, యాలకులు, మిరియాలు, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. కొన్ని నిమిషాల తరువాత టమాటా పేస్ట్‌ను వేయాలి. బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించాలి. అనంతరం ఉల్లిపాయల పేస్ట్‌ను వేసి కలిపి ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు ఉడికిన తరువాత పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, కసూరీ మేథీ, ఉప్పు వేయాలి. అనంతరం బాగా కలియబెట్టాలి.
ఇప్పుడు కొన్ని సెకన్ల పాటు ఉడికించిన తరువాత 2 కప్పుల నీళ్లను పోయాలి. తరువాత మళ్లీ ఉడికించాలి. గ్రేవీ బాగా మరుగుతున్న సమయంలో పనీర్ ముక్కలను వేసి కలపాలి. అనంతరం పనీర్‌ను ఉడకబెట్టాలి. పనీర్ చాలా మెత్తగా ఉంటుంది. కనుక త్వరగా ఉడుకుతుంది. 2-5 నిమిషాల్లో పనీర్ ముక్కలు ఉడకడమే కాదు.. మసాలా ఫ్లేవర్‌ను పీల్చుకుంటాయి కూడా. కనుక ఉడికేందుకు పెద్దగా సమయం పట్టదు. పనీర్ ఉడికిన తరువాత ఒకసారి కలిపి అనంతరం పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. దీంతో పనీర్ కుర్మా రెడీ అవుతుంది. అయితే గ్రేవీ చిక్కగా ఉండాలంటే మూత పెట్టకుండా ఉడికించాలి. గ్రేవీ కాస్త నీళ్ల మాదిరిగా ఉండాలంటే మూత పెట్టి ఉడికించాలి. దీంతో ఎంతో రుచికరమైన పనీర్ కుర్మా రెడీ అవుతుంది. దీన్ని చపాతీలు లేదా రోటీలతో కలిపి తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది.