మామిడి పండ్లను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. మామిడి పండ్లు వేసవి సీజన్‌లోనే వస్తాయి. అందుకని ఈ సీజన్‌లో వాటిని తప్పకుండా తినాలి. దీంతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మామిడి ఆకులతోనూ మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిని ఉపయోగించి మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో నీరు రంగు మారుతుంది. తరువాత స్టవ్ ఆర్పి ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం దాన్ని వడకట్టి తాగాలి. ఇలా మామిడి ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు నయం అవుతాయి.
1. విరేచనాల సమస్యతో బాధపడేవారు పై విధంగా మామిడి ఆకులతో నీటిని తయారు చేసుకుని తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. మామిడి పండ్లలాగే మామిడి ఆకుల్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి లు ఈ ఆకుల్లో ఉంటాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, వెంట్రుకలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.
3. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి మన శరీరానికి ఉపయోగపడతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
4. ఒక బకెట్‌లో వేడి నీటిని తీసుకుని అందులో కొన్ని మామిడి ఆకులు వేసి 5-10 నిమిషాలు ఉంచాలి. తరువాత నీరు గోరు వెచ్చగా అవగానే స్నానం చేయాలి. దీని వల్ల శరీరానికి హాయి కలుగుతుంది. అలసి పోయిన వారు ఇలా చేస్తే ప్రశాంతత పొందుతారు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వొచ్చు.
5. మామిడి ఆకులను మంట సెగపై కాల్చాలి. తరువాత ఆ ఆకులను గాయాలు, పుండ్లపై వేసి కట్టులా కట్టాలి. దీంతో గాయాలు, పుండ్లు తగ్గుతాయి. వాపులు కూడా తగ్గుతాయి. అయితే కట్టు తీసిన వెంటనే ఆ భాగాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. దీంతో గాయాలు, వాపులు, పుండ్లు త్వరగా మానుతాయి.
6. మామిడి ఆకులను కాల్చి వాటి నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా వెక్కిళ్లను తగ్గించుకోవచ్చు.
7. దగ్గు సమస్య ఉన్నవారికి మామిడి ఆకులు మేలు చేస్తాయి. మామిడి ఆకులతో పైన తెలిపిన విధంగా నీటితో మిశ్రమాన్ని తయారు చేసుకుని అందులో కొద్దిగా తేనె వేసి తాగాలి. రోజుకు 3 సార్లు ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.
8. మామిడి ఆకులు, నీటి మిశ్రమాన్ని రోజూ రెండు సార్లు తాగుతుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
9. మామిడి ఆకులను కొన్నింటిని తీసుకుని నీటితో శుభ్రం చేసి వాటిని నోట్లో వేసుకుని నమలాలి. తరువాత వాటిని ఉమ్మేసి నోటిని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు. నోట్లో బాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే మామిడి ఆకులు, నీటి మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించినా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
10. మామిడి ఆకులను సేకరించి నీటితో శుభ్రం చేసి వాటిని దంచి రసం తీయాలి. ఆ రసాన్ని రెండు చుక్కల మోతాదులో చెవుల్లో వేయాలి. తరచూ ఇలా చేస్తే చెవి నొప్పి, ఇతర చెవి సమస్యలు తగ్గుతాయి.
11. మామిడి ఆకులు, నీటి మిశ్రమం హైబీపీని తగ్గిస్తుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
12. మామిడి ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. అందులో కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్‌పై రాయాలి. కొంత సేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు ఉండవు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365