Mutton Liver Curry : మనం ఆహారంగా మటన్ తో పాటు మటన్ లివర్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియులకు మటన్ లివర్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ లివర్ ను తీసుకోవడం వల్ల రుచితో పాటు వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మటన్ లివర్ లో పుష్కలంగా ఉంచే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల విటమిన్ డి, విటమిన్ బి12, ఐరన్, కాపర్, జింక్, పోలేట్, ప్రోటీన్స్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేయడంలో కూడా మటన్ లివర్ మనకు ఉపయోగపడుతుంది. దీనిని చాలా మంది వేయించుకుని తింటూ ఉంటారు. ఫ్రైతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ కోర్మాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ లివర్ కోర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ లివర్ కోర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన మటన్ లివర్ ముక్కలు – అర కిలో, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – పావు కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ – అర కప్పు, నీళ్లు – అర లీటర్, గరం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు – అర కట్ట.
మటన్ లివర్ కోర్మా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి మధ్యస్థ మంటపై నూనె పైకి తేలే వరకు కలుపుతూ బాగా వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత లివర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి 15 నుండి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.
కూర దగ్గర పడి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ లివర్ కోర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మటన్ లివర్ తో ఈ విధంగా కూరను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.