Onion Juice For Hair : ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులను వాడడం, వైరస్ ఇన్ఫెక్షన్ లు వంటి రకరకాల కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం వాడడం కూడా చాలా తేలిక. జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కా ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉల్లిపాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను జల్లి గిన్నెలో లేదా కాటన్ వస్త్రంలో తీసుకుని దాని నుండి రసాన్ని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉల్లిపాయ రసాన్ని జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా చక్కగా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో కాఫిరాల్ అనే రసాయన సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. దీంతో రక్తంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు చక్కగా అందుతాయి. తగినన్ని పోషకాలు అందండం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే దీనిలో ఉండే సల్ఫర్ జుట్టు త్వరగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్ల దగ్గర ఉండే కెరాటిన్ ను ఉత్తేజపరుస్తుంది. అలాగే ఈ సల్ఫర్ జుట్టు కుదుళ్ల దగ్గర కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా ఉండడంతో పాటు జుట్టు త్వరగా పెరుగుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది. జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడే వారు ఈ విధంగా ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.