Bagara Baingan : బగారా బైంగన్.. గుత్తి వంకాయలతో చేసే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బగారా అన్నంతో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. విందుల్లో ఎక్కువగా ఈ కూరను వడ్డిస్తూ ఉంటారు. ఈ బగారా బైంగన్ కూరను మనం చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బగారా బైంగన్ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బగారా బైంగన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లేత గుత్తి వంకాయలు – 6, పల్లీలు – పావు కప్పు, ఎండుమిర్చి – 2, నువ్వులు – 2 టీ స్పూన్స్, ఎండుకొబ్బరి పొడి -పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఆవాలు – ఒకటీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిక్కటి చింతపండు పులుసు – పావు కప్పు, నీళ్లు – 100 ఎమ్ ఎల్, కరివేపాకు – రెండు రెమ్మలు.
బగారా బైంగన్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. తరువాత కొబ్బరి పొడి వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నాలుగు పచ్చాలుగా చేసుకున్న వంకాయలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత చింతపండు పులుసు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత కరివేపాకు వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత వేయించిన వంకాయలు వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బగారా బైంగన్ తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.