Perugu Pachadi : మనం పెరుగును ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని మనందరికి తెలుసు. బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో వేడిని తగ్గించడంలో పెరుగు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగును నేరుగా అలాగే ఆహారంగా తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎంతో సులభంగా చేసుకోగలిగే ఈ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర కప్పు, కారం – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 15, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా.
పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా పెరుగులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును వేసి కలపాలి. దీనిని పెరుగులోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. తరువాత గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. పెరుగుతో అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు.