Cauliflower Fry : మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. అయితే ఇది కొందరికి నచ్చదు. దీని వాసన అదో మాదిరిగా ఉంటుంది. కనుక కాలిఫ్లవర్‌ను తినేందుకు చాలా మంది ఇష్టపడరు. అయితే కాలిఫ్లవర్‌ను వేపుడు రూపంలో చేస్తే మాత్రం చాలా మందికి నచ్చుతుంది. ఈ క్రమంలోనే కాలిఫ్లవర్‌ను మరింత రుచిగా వేపుడు కూరగా ఎలా చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిఫ్లవర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలిఫ్లవర్ – 1, కోడిగుడ్లు – 2, పాలు – 3 టీస్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, పసుపు – చిటికెడు, పల్లి నూనె – పావు కప్పు, మిరియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – తగినంత.
కాలిఫ్లవర్ ఫ్రై ని తయారు చేసే విధానం..
కాలిఫ్లవర్ ముక్కలను ముందుగా వేడి నీటిలో వేసి శుభ్రంగా కడిగి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. తరువాత నీళ్లు వంపేసి ఆరబెట్టాలి. తరువాత కోడిగుడ్డు సొన, పాలు, పసుపు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. జీలకర్రను కొద్దిగా వేయించి సగం జీలకర్రను గుడ్డు మిశ్రమంలో కలపాలి. కాలిఫ్లవర్ ముక్కలను గుడ్డు మిశ్రమంలో వేసి సొన ముక్కలను బాగా అంటేలా కలపాలి. నూనె వేడి చేసి సొన అంటిన కాలిఫ్లవర్ ముక్కలను డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అనంతరం అందులో మిగిలిన జీలకర్రను వేసి బాగా కలపాలి. దీంతో కాలిఫ్లవర్ ఫ్రై రెడీ అయినట్లే. దీన్ని అన్నంలో కలిపి తినలేము. కానీ వేరే కూరతో కలిపి తినవచ్చు. అంచుకు పెట్టి తింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందరికీ ఈ వేపుడు నచ్చుతుంది. ఎంతో ఇష్టంగా తింటారు.