Ravva Payasam : మనం వంటింట్లో తయారు చేసే తీపి వంటకాల్లో రవ్వ పాయసం ఒకటి. రవ్వను ఉపయోగించి చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ రవ్వ పాయసాన్ని ఇష్టంగా తింటారు. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సలుభం. వంటరాని వారు, మొదటి సారి చేసే వారు కూడా ఈ పాయసాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చక్కగా రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – పావు కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, పాలు – అర లీటర్, నానబెట్టిన చిరోంజి పప్పు – 3 టేబుల్ స్పూన్స్, పంచదార – 100 గ్రా., కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు.
రవ్వ పాయసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించాలి. జీడిపప్పును వేయించుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వను వేసి వేయించాలి. రవ్వ చక్కగా వేగిన తరువాత నీళ్లు పోసి కలపాలి. రవ్వ ఉడికి నెయ్యి వేరవుతుండగా పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత నానబెట్టిన చిరోంజి పప్పు వేసి కలపాలి. దీనిని 10 నుండి 12 నిమిషాల పాటు చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. తరువాత పంచదార , కుంకుమ పువ్వు వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత దీనిలో యాలకుల పొడి , వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న పచ్చ కర్పూరం వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ పాయసం తయారవుతుంది. దీనిని చల్లగా, వేడిగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో ఇలా రవ్వ పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ రవ్వ పాయసాన్ని ఒక స్పూన్ కూడా విడిచి పెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.