Chethi Chekkalu : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. బియ్యం పిండితో మనం సులువుగా చేసుకోగలిగే పిండి వంటల్లో చేతి చెక్కలు ఒకటి. వీటిని చేతి పకోడీలు అని కూడా అంటారు. ఈ చేతి చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. మొదటిసారి చేసే వారు కూడా వీటిని తేలికగా చేసుకోవచ్చు. బియ్యం పిండితో చేతి చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేతి చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక చిన్న గ్లాస్, పొడి బియ్యం పిండి – 3 చిన్న గ్లాసులు, పచ్చిమిర్చి – 7, అల్లం – ఒక ఇంచు ముక్క, వేడి నూనె – అర గ్లాస్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, నానబెట్టిన శనగపప్పు – గుప్పెడు, తరిగిన కరివేపాకు – 3 రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చేతి చెక్కల తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగనన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. తరువాత పిండి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని సన్నగా పొడుగ్గా చేత్తో చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి రోల్ ను తీసుకుని బొటన వేలు, చూపుడు వేలు సహాయంతో పలుచగా వత్తుకోవాలి.
ఇలా వత్తుకున్న చేతి చెక్కలను నూనె రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తగినన్ని వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని చేతి చెక్కలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేతి చెక్కలు తయారవుతాయి. ఇవి నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన చేతి చెక్కలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.