Chapati Laddu : మనం తరచూగా గోధుమపిండితో చపాతీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చపాతీలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి ఈ చపాతీలను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే పంచదార, జామ్ వంటి వాటితో కూడాఈ చపాతీలను తింటూ ఉంటాం. ఈ విధంగా తీసుకోవడంతో పాటు ఈ చపాతీలతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా తేలిక. చపాతీలతో రుచిగా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 4 టీ స్పూన్స్, బెల్లం తురుము – అర కప్పు లేదా తగినంత, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
చపాతీ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత మరో టీ స్పూన్ నెయ్యి వేసి పిండిని కలుపుకోవాలి. తరువాత దానిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానివ్వాలి. 10 నిమిషాల తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి గోధుమపిండి వేసుకుంటూ చపాతీ వత్తుకోవాలి. ఇలా చపాతీలను వత్తుకున్న తరువాత పెనం మీద వేసి కాల్చుకోవాలి. వీటిని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ చపాతీలను ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడి నుండి సగం పొడిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో బెల్లం తురుమును వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులోనే యాలకుల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ తగినంత చపాతీ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చపాతీ లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూలను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చపాతీ లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకున్న చపాతీలతో పాటు తినగా మిగిలిన చపాతీలతో కూడా ఈ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.