Sajja Idli : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటి వాడకం పెరిగించదనే చెప్పవచ్చు. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. పిల్లలకు సజ్జలను ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సజ్జలను తినడం వల్ల ఇవే కాకుండా మన ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ సజ్జలతో ఎక్కువగా రొట్టెలు, గటక వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీల తయారీ సాధారణ ఇడ్లీ తయారీ వలె సులవుగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జలతో ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సజ్జల ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జలు – ఒక కప్పు, మినపప్పు – అర కప్పు, ఉప్పు – తగినంత.
సజ్జల ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సజ్జలను, మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 7 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని జార్ లో లేదా గ్రైండర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 8 గంటల పాటు పులియబెట్టాలి. తరువాత ఈ పిండిలోకొద్దిగా ఉప్పు, మరికొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి నీళ్లు మరిగే వరకు వేడి చేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని అందులో తగినంత పిండిని వేసి ఇడ్లీ కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి. వీటిని 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత వీటిని బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ సజ్జ ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. సజ్జలతో రొట్టెలను కాకుండా అప్పుడప్పుడూ ఇలా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.