Curry Without Vegetables : మనం రకరకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కూరగాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే మనం ఎటువంటి కూరగాయలను ఉపయోగించకుండా కూడా రుచిగా కూరను తయారు చేసుకోవచ్చు. కూరగాయలను ఉపయోగించకుండా చేసే ఈ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులువుగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలు లేకుండా కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కూరగాయలు లేకుండా కూర తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయ – 1, చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, పసుపు – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 టీ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మినపగుళ్లు – ఒక టేబుల్ స్పూన్.
కూరగాయలు లేకుండా కూర తయారు చేసే విధానం..
ముందుగా కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా పేస్ట్ కు పదార్థాలన్నీ వేసి దోరగా వేయించాలి. మసాలా దినుసులు చక్కగా వేగిన తరువాత కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత తరిగిన కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈవిధంగా ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఎటువంటి కూరగాయలు లేకుండా తయారు చేసిన ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.