Onion Dosa : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఉదయం పూట తయారు చేసే అల్పాహారాల్లో దోశ కూడా ఒకటి. దోశను తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ దోశలను మనం రకరకాల రుచుల్లో తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే ఆనియన్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, మెంతులు – అర టీ స్పూన్, అటుకులు – పావు కప్పు, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, అల్లం తురుము – ఒక టీ స్పూన్.
ఆనియన్ దోశ తయారీ విధానం..
ముందుగా మినపప్పును, బియ్యంను, మెంతులను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత వాటిలో తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను పిండి పట్టడానికి అర గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత వీటన్నింటిని ఒక జార్ లో లేదా గ్రైండర్ లో వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 8 గంటల పాటు పిండిని పులియబెట్టాలి. పిండి బాగా పులిసిన తరువాత తగినంత పిండిని ఒక గన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తరువాత ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని దోశ అంతా వేసుకోవాలి. తరువాత ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనెను వేసి దోశను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. దోశను ఒక వైపు ఎర్రగా అయ్యేలా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆనియన్ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణ దోశలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా ఆనియన్ దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.