Millets : మన ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాము. చిరు ధాన్యాల వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర అనేక రకాల పోషకాలు ఉంటాయి. వైద్యులు సైతం వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. బరువు తగ్గడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మనకు చిరు ధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. బీపీ అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది.
జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో చిరు ధాన్యాలు మనకు ఎంతో దోహదపడతాయి. మనం అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొర్రలు, సామలు, ఊదలు, రాగులు వంటి అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం. వీటితో అన్నం, రొట్టె, జావ, గటక, కిచిడీ, దోశ, ఉప్మా వంటి వాటిని వండుకుని తింటూ ఉంటాం. ఈ చిరు ధాన్యాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకునే వారు కూడా ఉంటారు. అయితే ఈ చిరు ధాన్యాలు త్వరగా పురుగు పడుతూ ఉంటాయి. పురుగుపట్టిన చిరు ధాన్యాలు తినడానికి పని చేయవు. అలాగే పురుగు పట్టిన చిరు ధాన్యాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక వీటిని సాధ్యమైనంత వరకు పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవాలి.
చిరు ధాన్యాలను ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిరు ధాన్యాలను ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేసుకోకూడదు. స్టీల్, గాజు, రాగి, ఇత్తడి వంటి వాటిలో నిల్వ చేసుకోవాలి. అలాగే నిల్వ చేసుకునే పాత్ర తడి లేకుండా చూసుకోవాలి. తరువాత మనం తీసుకున్న చిరు ధాన్యాల్లో సగం చిరు ధాన్యాలను పాత్రలో పోయాలి. తరువాత వాటిపై రెండు ఎండుమిర్చిని, 3 లవంగాలు ఉంచాలి. తరువాత మిగిలిన వాటిని పోసి వాటిపై కూడా ఎండుమిర్చిని, లవంగాలను వేయాలి. తరువాత గాలి తగలకుండాగట్టిగా మూత పెట్టాలి. ఈ విధంగా ఎటువంటి చిరు ధాన్యాలనైనా నిల్వ చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల చిరు ధాన్యాలు చాలా కాలం వరకు పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే వీటిని తేమ లేని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. అదే విధంగా ఈ చిరు ధాన్యాలను ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువగా కడగకూడదు. అలాగే వీటిని 6 నుండి 8 గంటల పాటు నానబెట్టిన తరువాత మాత్రమే ఉడికించి ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసిన చిరు ధాన్యాలను చక్కగా నానబెట్టి ఉడికించి తీసుకోవడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.