Malai Laddu : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మలై లడ్డూ కూడా ఒకటి. పాలతో చేసే ఈ లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. మలై లడ్డూ తిన్నా కొద్ది తినాలనిపించేత రుచిగా ఉంటుంది. ఈ లడ్డూలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే ఈ మలై లడ్డూలను మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మలై లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – 100 గ్రా., నిమ్మ ఉప్పు – రెండు చిటికెడు, పాలపొడి – పావు కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
మలై లడ్డూ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పాలు, పంచదార వేసి కలపాలి. ఈ పాలను చిన్న మంటపై కలుపుతూ మీగడ కట్టకుండా సగం అయ్యే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత నిమ్మ ఉప్పు వేసి కలపాలి. ఇలా కలపడం వల్ల పాలు క్రీమీగా తయారవుతాయి. తరువాత పాల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని కళాయికి అంచులకు రాసి 6 నుండి 7 గంటల పాటు అలాగే ఉంచాలి. తరువాత దీనిని కళాయి నుండి వేరు చేసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మలై లడ్డూలు తయారవుతాయి. వీటిని తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల మూడు రోజుల పాటు తాజాగా ఉంటాయి. పండుగలకు, తీపి తినాలనిపించినప్పుడు ఇలా మలై లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.