Semiya Rava Kichdi : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా త్వరగా వీటిని తయారు చేసుకోవచ్చు. సేమియా ఉప్మా, సేమియా పాయసం, సేమియా పులిహోర వంటి వాటినే కాకుండా వీటితో మనం సేమియా రవ్వ కిచిడీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. సేమియాతో రవ్వ కిచిడీని తయారు చేయడం చాలా సులభం. రుచిగా, సులభంగా సేమియాతో రవ్వ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా రవ్వ కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 10, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 3, నీళ్లు – 3 కప్పులు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన టమాట – 1, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, మటన్ మసాలా – అర టీ స్పూన్.
సేమియా రవ్వ కిచిడీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక సేమియా వేసి వేయించాలి. సేమియా కొద్దిగా వేగిన తరువాత రవ్వ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత క్యారెట్, బీన్స్, బఠాణీ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన సేమియా, టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా రవ్వ కిచిడీ తయారవుతుంది. సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు.