Instant Soft Idli : మనం ఉదయం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీ రుచిగా, చాలా మెత్తగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇడ్లీని తయారు చేయాంటే మనం ముందు రోజే పిండిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా నిమిషాల వ్యవధిలోనే మనం మెత్తటి ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. చాలా రుచిగా, మెత్తగా కూడా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పుల్లటి పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత పిండిని ఇడ్లీ ప్లేట్ లలో వేసుకుని కుక్కర్ లో ఉంచి మూత పెట్టాలి. ఈ ఇడ్లీలను మధ్యస్థ మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇడ్లీలను బయటకు తీసి 4 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత వీటిని ఇడ్లీ ప్లేట్ నుండి తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలను ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు అలాగే ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.