Chinthakaya Pappu Charu : మనం వంటింట్లో తరచూ పప్పు చారును తయారు చేస్తూ ఉంటాం. పప్పుచారును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పప్పు చారును తయారు చేయడానికి మనం చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. కేవలం చింతపండుతోనే కాకుండా పచ్చి చింతకాయలతో కూడా మనం పప్పు చారును తయారు చేసుకోవచ్చు. పచ్చి చింతకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక విధాలుగా చింతకాయలు మనకు ఉపయోగపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింతకాయలతో రుచిగా పప్పు చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ పప్పు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక టీ గ్లాస్, పసుపు – పావు టీ స్పూన్, చింతకాయలు – 200 గ్రా., పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన టమాట – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, నీళ్లు – రెండున్నర గ్లాసులు, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, బెల్లం – చిన్న ముక్క.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్.
చింతకాయ పప్పు చారు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు, పసుపు వేసి మూత పెట్టాలి. ఈ పప్పును 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే చింతకాయలను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి చింతకాయలను మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి చింతకాయలను చేత్తో బాగా పిండుతూ రసాన్ని తీసుకుని పిప్పిని పడేయాలి. ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి ముక్కలుగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును రుచి చూసుకుంటూ వేసుకోవాలి.
తరువాత ఉప్పు, కారం, బెల్లం, నీళ్లు పోసి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పప్పుచారులో వేసి కలపాలి. తాళింపు వేసిన తరువాత పప్పు చారును మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చింతపండు కంటే ఇలా చింతకాయలను ఉపయోగించి చేసే పప్పు చారు మరింత రుచిగా ఉంటుంది.