Gongura Kobbari Pachadi : ఆకుకూరలను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనకు వచ్చే వ్యాధులను నయం చేస్తాయి. పోషకాలను అందిస్తాయి. కనుక ఆకుకూరలను తినాలని చెబుతుంటారు. అయితే ఆకుకూరల్లో గోంగూరను ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో పచ్చడి, పప్పు, కూర వంటివి చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర, కొబ్బరి వేసి పచ్చడిని కూడా చేయవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. గోంగూర కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర ఆకులు – 4 కప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు లేదా పొడి – 3 టీస్పూన్లు, ఎండు మిర్చి – 6, వెల్లుల్లి రెబ్బలు – 8, ధనియాలు – 2 టీస్పూన్లు, జీలకర్ర – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – 5 టీస్పూన్లు.
![Gongura Kobbari Pachadi : గోంగూర కొబ్బరి పచ్చడి తయారీ ఇలా.. అన్నంలో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.. Gongura Kobbari Pachadi recipe in telugu make in this method](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2023/01/gongura-kobbari-pachadi.jpg)
గోంగూర కొబ్బరి పచ్చడిని తయారు చేసే విధానం..
గోంగూర ఆకులను కాడలు లేకుండా ఏరి కడిగి జల్లెడలో లేదా వస్త్రంపై వేసి ఆరనివ్వాలి. వెడల్పాటి పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేసి ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసి గోంగూర ఆకులు, పసుపు వేసి కలిపి మగ్గబెట్టాలి. ఆకు పూర్తిగా మొత్తబడ్డాక ఇంతకు ముందు చేసి పెట్టుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. వేరే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, గోంగూర ముద్ద వేసి కలిపి దింపేయాలి. ఇందులో నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.