Shanagapappu Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగపప్పు కూడా ఒకటి. శనగపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. శనగపప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శనగపప్పుతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. శనగపప్పుతో కూరలు, తీపి వంటకాలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని మనం తినవచ్చు. కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే ఈ శనగపప్పు పచ్చడి తయారీ విధానం గురించి.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – అర కప్పు, ఎండుమిర్చి – 10 లేదా కారానికి తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మకాయ – 1( పెద్దది).
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – రెండు చిటికెలు, నూనె – ఒక టేబుల్ స్పూన్.
శనగపప్పు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో శనగపప్పు వేసి వేయించాలి. శనగపప్పును దోరగా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే తగినన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచికి తగినంత నిమ్మరసం వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత మిగిలిన తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగపప్పుతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.