Peanuts And Heart Attack : మన వంటింట్లో ఉండే నూనె దినుసుల్లో పల్లీలు ఒకటి. పల్లీలను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉన్న ఉప్పటికి వీటిని తినడానికి చాలా మంది సందేహిస్తూ ఉంటారు. పల్లీలను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని, అలాగే గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అసలు ఈ అపోహలు నిజమా కాదా…పల్లీలను ఆహారంగా తీసుకోకూడదా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 100 గ్రాముల పల్లీలల్లో 567 క్యాలరీల శక్తి, 17 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 25 గ్రాముల ప్రోటీన్, 45 గ్రాముల కొవ్వులు, 10 గ్రాముల ఫైబర్, 90 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. పల్లీలల్లో కొలెస్ట్రాల్ ఉండదు.
అలాగే వీటిలో ఉండే కొవ్వులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అలాగే పల్లీలల్లో ఉండే ఫైటో స్టిరాల్ మనం తీసుకునే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ ను రక్తంలో కలవకుండా చేయడంలో సహాయపడుతుంది. పల్లీలల్లో ఉండే రసాయన సమ్మేళనాలు కాలేయంలో ఉండే మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి, దేహధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు, పిల్లలు, బాలింతలు, వ్యాయామాలు చేసే వారు, ఆటగాళ్లు పల్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ తక్కువ ధరలో లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు వీటిని తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. దీంతో మనం ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకోకుండా ఉంటాము. అంతేకాకుండా పల్లీలను తినడం వల్ల బరువు పెరగకుండా కూడా ఉంటారని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. అదే విధంగా పల్లీలల్లో రస్వట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.
ఇది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా చేయడంలో సహాయపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. చాలా మంది పల్లీలను నూనెలో వేయించి మసాలా పొడి, ఉప్పు, కారం చల్లుకుని తింటారు. ఇలా తీసుకోవడం వల్ల పల్లీల వల్ల కలిగే మేలు కంటే కీడే ఎక్కువగా జరగుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే భూమి నుండి తీసిన పల్లీలను తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి పల్లీలు దొరకని వారు రాత్రంతా నానబెట్టిన పల్లీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.