Vamu Kommulu : మనం వంటింట్లో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, తేలికగా చేసుకోదగిన పిండి వంటల్లో వాము కొమ్ములు ఒకటి. వాము వేసి చేసే పిండి వంట చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినే కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. బయట దొరికే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఈ విధంగా ఇంట్లోనే వాము కొమ్ములను తయారు చేసుకుని స్నాక్స్ గా తినడం ఉత్తమమైన పని. ఎంతో రుచిగా ఉండే ఈ వాము కొమ్ములను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాము కొమ్ముల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – 2 టీ గ్లాసులు, శనగపిండి – ఒక టీ గ్లాస్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, వేడి నూనె – పావు టీ గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
వాము కొమ్ముల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి, వాము, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మురుకుల పిండి వలె మెత్తగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మురుకుల గొట్టాన్ని తీసుకుని దానిలో మనకు నచ్చిన ఆకారంలో బిళ్లను ఉంచాలి. తరువాత దానికి నూనె రాయాలి. తరువాత అందులో తగినంత పిండిని ఉంచి నూనెలో మనకు నచ్చిన ఆకారంలో మురుకులను వత్తుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా వాము కొమ్ములను వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే వాము కొమ్ములు తయారవుతాయి. ఇవి వాము రుచితో చాలా చక్కగా ఉంటాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజులు తాజాగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.