Chekkalu : మనం వంటింట్లో బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం ఎక్కువగా తయారు చేసే పిండి వంటల్లో చెక్కలు ఒకటి. చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేసే విధానం అందరికి తెలిసినప్పటికి కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేకపోతుంటారు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా చెక్కలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – పావు కప్పు, అల్లం – 50 గ్రా., పచ్చిమిర్చి – 10, బటర్ – 100 గ్రా., బియ్యం పిండి – ఒక కిలో, వేడి నీళ్లు – ఒక లీటర్, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – 4 రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చెక్కల తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టాలి. తరువాత ఒక జార్ లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద ప్లేట్ లో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా వేసుకోవాలి. అలాగే ఉప్పు, కరివేపాకు, బటర్ వేసి అంతా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత వేడి నీటిని పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ మెత్తగా,మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా దానిపై తడి వస్త్రాన్ని గానీ, ప్లేట్ ను గానీ ఉంచాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత పూరీ ప్రెస్ ను తీసుకుని దానిపై మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ ను ఉంచి దానికి నూనె రాయాలి.
ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ చెక్కల్లా వత్తుకుని కాటన్ వస్త్రంపై వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా వత్తుకున్న చెక్కలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే చెక్కలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ చెక్కలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.