Rayalaseema Special Palli Podi : మనం పల్లీలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పల్లీలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. పల్లీలను వివిధ రకాల వంటకాలతో పాటు పచ్చళ్లు, చట్నీలు కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పల్లీలతో మనం ఎంతో రుచిగా ఉండే పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. పల్లీ పొడి చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఈ పల్లి పొడిని రుచిగా, అందరూ ఇష్టపడేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 100 గ్రా., ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి – 10, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
పల్లి పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి సగానికి పైగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పడు అదే కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే వేయించిన ఎండుమిర్చి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈకారం పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలను కూడా ఈ కారం పొడిని తినవచ్చు. పల్లీలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కారం పొడిని తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఈ కారం పొడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.