Pichi Thotakura : ఆయుర్వేదం ద్వారా మనం రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉపయోగించి మనం ఎంతో చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనం ఔషధంగా ఉపయోగించుకోగలిగిన మొక్కల్లో పిచ్చి తోటకూర మొక్క కూడా ఒకటి. దీనిని చిలక తోట కూర, కోడి జుట్టు ఆకు అని కూడా అంటారు. ఇది మనకు విరివిరిగా కనబడుతూనే ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా నాటాల్సిన పని లేదు. గాలి ద్వారా ఈ మొక్క విత్తనాలు వ్యాప్తి చెంది వాటంతట అవే పెరుగుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేయడంలో ఈ పిచ్చి తోటకూర మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో దీనిని కూరగా వండుకుని తినే వారు. కనుకనే మన పూర్వీకులు రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండే వారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ మొక్కను ఉపయోగించడమే మానేశాం. కనుకనే చిన్న చిన్న ఇన్ ఫెక్షన్ లను కూడా తట్టుకోలేకపోతున్నాం.
దీనిని కలుపు మొక్కగా భావించి నిర్మూలిస్తూ ఉంటారు. కానీ పిచ్చి తోటకూర మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పిచ్చి తోటకూరలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ తోపాటు కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్పరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఈ మొక్క ఆకులను తరచూ కూరగా చేసుకుని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్క శరీరంలో ఉండే వేడిని తగ్గించి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అధిక వేడితో బాధపడే వారు దీనిని ఏవిధంగా తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. శరీరం వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.
మొలలతో బాధపడే వారు ఈ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు మొలలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా మొలల వ్యాధి తగ్గుతుంది. విరిగిన ఎముకలను సైతం అతుక్కునేలా చేయడంలో పిచ్చి తోటకూర మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగిన వారు అవి విరిగిన చోట కట్టు కట్టి ఆ తరువాత ఈ మొక్క ఆకుల నుండి సేకరించిన రసంలో తగినంత ఉప్పును కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. డయేరియాతో బాధపడే వారికి ఈ మొక్క మొత్తాన్ని సేకరించి శుభ్రపరిచి నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ఒక గ్లాస్ మోతాదులో తాగించడం వల్ల డయేరియా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
మూత్రంలో మంట సమస్యతో బాధపడే వారు పిచ్చి తోటకూర మొక్క వేర్లను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఆ రసాన్ని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఈ పిచ్చి తోటకూర మొక్క మనకు ఉపయోగపడుతుంది. పిచ్చి తోటకూర విత్తనాలను సేకరించి ఎండబెట్టి వాటికి సమానంగా బాగా ఎండిన అంజీరా పండును, పటిక బెల్లాన్ని కలిపి దంచి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఈ పొడిని 15 గ్రాముల మోతాదులో ఒక కప్పు నీటిలో వేసి కలుపుకుని రెండు వారాల పాటు తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి లేపనంగా రాయడం వల్ల చర్మం పై వచ్చే కురుపులు నశిస్తాయి. ఈ విధంగా పిచ్చి తోటకూర మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.