White Sauce Pasta : మనకు రెస్టారెంట్ లలో లభించే వాటిల్లో వైట్ సాస్ పాస్తా కూడా ఒకటి. వైట్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కంటికి ఇంపుగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ పాస్తాను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడేలా, రుచిగా, సులభంగా వైట్ సాస్ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వైట్ సాస్ పాస్తా తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పాలు – 300 ఎమ్ ఎల్, పాస్తా – ఒకటిన్నర కప్పు, ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్స్, ఉల్లిపాయ తరుగు – రెండు టీ స్పూన్స్, తరిగిన ఎల్లో క్యాప్సికం ముక్కలు – అర కప్పు, తరిగిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు – అర కప్పు, తరిగిన రెడ్ క్యాప్సికం ముక్కలు – అర కప్పు, రెడ్ చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఇటాలియన్ హెర్బ్స్ – అర టీ స్పూన్, ఉడికించిన పచ్చి బఠాణీ – అర కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 2 టీ స్పూన్స్, మోజరెల్లా చీజ్ – అర కప్పు.
వైట్ సాస్ పాస్తా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ వేడయ్యాక మైదాపిండి వేసి కలుపుతూ వేయించాలి. మైదాపిండి చక్కగా వేగి బటర్ పైకి తేలిన తరువాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని కలుపుతూ చిక్కబడే వరకు ఉడికించాలి. మైదాపిండి మిశ్రమం కొద్దిగా చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత పాస్తా వేసి ఉడికించాలి. పాస్తా చక్కగా ఉడికిన తరువాత వాటిని వడకట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్, ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత క్యాప్సికం ముక్కలు వేసి పెద్ద మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇటాలియన్ హెర్బ్స్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత బఠాణీ వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న వైట్ సాస్ ( మైదా పిండి మిశ్రమం) వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిని బటర్ పైకి తేలే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఉడికించిన పాస్తా వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత ఫ్రెష్ క్రీమ్, చీజ్ వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వైట్ సాస్ పాస్తా తయారవుతుంది. ఈ పాస్తాను అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ పాస్తాను ఎంతో ఇష్టంగా తింటారు.