Pudina Tomato Rice : మనం పుదీనాను కూడా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు పుదీనాతో పుదీనా పచ్చడి. పుదీనా రైస్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పుదీనా రైస్ ను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలు వేసి చేసే ఈ పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా తేలిక. ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాట రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టమాట రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – పావుకిలో బియ్యంతో వండినంత, పుదీనా – 2 కట్టలు, తరిగిన టమాటాలు – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
పుదీనా టమాట రైస్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పుదీనా ఆకులు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పుదీనా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు, అన్నం వేసి కలపాలి. తరువాత జీడిపప్పు వేసి కలపాలి.
అంతా కలిసేలా కలుపుకుని ఒక నిమిషం పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాట రైస్ తయారవుతుంది. దీనిని లంచ్ బాక్స్ లోకి కూడా తయారు చేసుకుని తినవచ్చు. రైతాతో కలిపి తింటే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.