Stuffed Capsicum : మనం క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో కూడా మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ ఫ్రైను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ క్యాప్పికం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాప్సికం – 4, ఉడికించిన బంగాళాదుంపలు – 4, తరిగిన ఉల్లిపాయ -1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా.
స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై తయారీ విధానం..
ముందుగా క్యాప్సికం తొడిమలను, లోపల గింజలను తీసేయాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న క్యాప్సికంను వేసి వేయించాలి. క్యాప్సికం అన్ని వైపులా చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలిపిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బంగాళాదుంప మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
తరువాత వేయించిన క్యాప్సికంలో ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక స్టఫ్ చేసుకున్న క్యాప్సికాన్ని వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.